Apple Software: టెక్ ప్రపంచంలో సంచలనం..! రీడిజైనింగ్ కు సిద్ధమైన యాపిల్ సాఫ్ట్‌వేర్.! 15 d ago

యాపిల్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కంపెనీకి ఉన్న పేరు అలాంటిది. చాలా మంది యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చెయ్యడానికి ఆసక్తి చూపుతారు. ఆ సాఫ్ట్‌వేర్ అలాంటిది మరి. యాపిల్ సెక్యూరిటీ ఫీచర్లు, సిస్టమ్ అప్‌డేట్‌లు.. సాఫ్ట్‌వేర్ పనితీరు కారణంగా యాపిల్ బ్రాండ్ కు అంత ఫేమ్ వచ్చింది. దాంతోపాటు డిజైనింగ్, R అండ్ D (పరిశోధన, అభివృద్ధి) విభాగం నిత్యం అందిస్తున్న అప్డేట్లకు వినియోగదారులు ఫిదా అవుతుంటారు. యాపిల్ కంపెనీ ఎప్పుడూ కొత్త కొత్త డిజైన్‌లు, మార్పులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ఏకంగా వాళ్ళు తమ సాఫ్ట్‌వేర్‌లో పెద్ద మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని విధంగా సాఫ్ట్‌వేర్‌ని పూర్తిగా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఈ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్ ప్రారంభంకానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పులు యాపిల్ ఫ్లాగ్లిప్ పరికరాలైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ వంటి ప్రధాన పరికరాలలో వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. అసలు సాఫ్ట్‌వేర్ లో వచ్చే ఆ మార్పులేంటో ఒకసారి చూద్దాం రండి!
సాఫ్ట్‌వేర్‌లో రానున్న మార్పులు:
- రాబోయే యాపిల్ సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఒకే విధమైన డిజైన్ ఉంటుంది.
- macOS, iOS, iPadOS మధ్య ఉన్న సాఫ్ట్‌వేర్ ఫీచర్లలోని భేదాలను ఈ మార్పులు తొలగిస్తాయి.
- గత సంవత్సరం విడుదల చేసిన Apple Vision Pro మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ సాఫ్ట్‌వేర్ నుండి ప్రేరణ పొంది ఈ మార్పులు చేస్తున్నారు.
- ఈ నూతన రూపకల్పనలో ఐకాన్‌లు, మెనూలు, అప్లికేషన్‌లు, సిస్టమ్ బటన్‌లలో కూడా మార్పులు ఉంటాయి.
యాపిల్ వ్యూహాత్మక లక్ష్యాలు:
- కంపెనీ ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తిని పెంచడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది.
- ఈ నూతన రూపకల్పన యాపిల్‌కు చాలా కీలకం అని నిపుణులు భావిస్తున్నారు.
- గత ఏడాదిలో ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
- ఆకర్షణీయమైన ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టడం ద్వారా యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలను పెంచాలని కంపెనీ చూస్తోంది.
- iOS 19, iPadOS 19, macOS 16లలో భాగంగా ఈ సాఫ్ట్‌వేర్ నవీకరణలను జూన్‌లో జరిగే యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
అన్ని పరికరాలలో ఒకే విధమైన అనుభూతిని అందించడం లక్ష్యంగా యాపిల్ తన సాఫ్ట్‌వేర్‌లో పెద్ద మార్పులు చేస్తోంది. భవిష్యత్తులో మరింత సులభమైన.. సహజమైన ఇంటర్‌ఫేస్‌ను వినియోగదారులకు అందించడానికి ఈ మార్పులు సహాయపడతాయని యాపిల్ పేర్కొంది. అలాగే అమ్మకాలు పెంచడానికి కూడా యాపిల్ ప్రయత్నిస్తోంది. జూన్ లో జరగబోయే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో ఈ అప్డేట్స్ గురించి తెలుస్తుంది.